Mane Praveen

Dec 29 2023, 22:42

NLG: షెడ్యూల్ ప్రకారం రోజుకు నాలుగు గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడెం మండలంలో రెవిన్యూ, ఎంపీడీవో ఆఫీస్ అధికారులు రెండు టీం గా ఏర్పడి ఉదయం ఒక గ్రామంలో మధ్యాహ్నం ఒక గ్రామంలో.. మొత్తంగా రోజుకు నాలుగు గ్రామాలలో ప్రభుత్వ ఆరు గారంటీ పథకాల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఈ ప్రక్రియ వచ్చే నెల ఆరవ తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాలలో దరఖాస్తులు స్వీకరించి రసీదులు ఇస్తామని అధికారులు తెలుపుతున్నారు.

Mane Praveen

Dec 28 2023, 17:57

NLG: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే బాలునాయక్ కు వినతి పత్రం

నల్లగొండ జిల్లా:

దేవరకొండ: ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే నేనావత్ బాలునాయక్ కు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 7792 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని సంక్షేమ హాస్టల్లో బకాయిలో ఉన్న మెచ్చార్జీలు విడుదల చేయాలని, తెలంగాణ నూతన ప్రభుత్వం పెంచిన మెస్ కాస్మోటిక్ చార్జీలు అమలు చేయాలని, మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద విద్యార్థులకు బస్ పాస్ ఉచితంగా అందించాలని, రాష్ట్రంలో అద్దె భవనాలలో ఉన్న గురుకులాలు కస్తూర్బాలు, సంక్షేమ హాస్టల్ లకు సొంతభవనాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు .హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు ట్రంక్ బాక్సులు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు అందించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కృష్ణ, అనిల్, కోటేష్, అఖిల్ సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Dec 28 2023, 17:02

చౌటుప్పల్: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

చౌటుప్పల్ పట్టణంలోని 1,2,3 వార్డులో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో.. అభయ హస్తం 06 గ్యారంటీల పథకాలు ప్రజలందరీకి చెందుతాయి అన్నారు. ప్రజా పాలన కోరుకుని, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.

మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయ హస్తం ఆరు గ్యారెంటీల పై తొలి సంతకాన్ని చెసింది మన ప్రభుత్వం, కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నామని అన్నారు.

చివరి వరుసలో ఉన్నా పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్టం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజా పాలన ఉద్దేశము నిస్సహాయులకు సాయం చేయటమే.. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ వార్డుకి, మీ ఇంటికి వచ్చింది.. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతీ ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, ACP మొగిలయ్య, CI దేవేందర్, RDO జగన్నాథం, విద్యుత్ శాఖ DE విజయభాస్కర్ రెడ్డి, AE శ్యామ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ కొరగొని లింగస్వామీ, బత్తుల రాజ్య, బండమీద మల్లేష్, కొయ్యడ సైదులు, సుల్తాన్ రాజు, ఉబ్బు వెంకటయ్య, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, అంతటి బాలరాజు, కామిషెట్టి భాస్కర్, నాయకులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహా, మాజీ సర్పంచి దొనకొండ ఈదయ్య, దొనకొండ క్రిష్ణ, నరసింహా, మరియు వివిధ శాఖల ఆఫీసర్స్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Mane Praveen

Dec 28 2023, 16:23

TS: తెలంగాణ జట్టు కెప్టెన్ గా నల్గొండ పట్టణానికి చెందిన రాచూరి వెంకట సాయి

ఈనెల 28 వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత రాష్ట్రంలో జరిగే అండర్ 17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి బాలుర ఫుట్బాల్ పోటీలకు నల్గొండ చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన రాచూరి వెంకట సాయి తెలంగాణ జట్టు కెప్టెన్ గా ఎన్నికైనాడని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు. 

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామం స్వస్థలమైన రాచూరి వెంకటసాయి చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ శిక్షణలో మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిరంతరం క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, పాటిస్తూ ఈ నెలలోనే జడ్చర్ల లోజరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ ను కనబరచడం ద్వారా SGF తెలంగాణ ఫుట్బాల్ జట్టుకు ఎంపిక కావడమే కాకుండా రాష్ట్ర జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడని తెలిపారు. 

ఈ సందర్భంగా బొమ్మ పాల గిరిబాబు మాట్లాడుతూ.. ఎంపికైన రాచూరి వెంకట సాయి లో ఉన్న సహజమైన ఫుట్బాల్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తిస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ కుంభం రాంరెడ్డి గారికి మరియు SGF జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ వడేన్న కు క్లబ్ తరఫున కృతజ్ఞతలు అని తెలిపారు.

ప్రస్తుతం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రాచూరి వెంకట సాయి గతంలో శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్ లో చేరి అక్కడ జాతీయ అంతర్జాతీయ కోచ్ ల సహకారంతో తన క్రీడా నైపుణ్యాన్ని అంచెలంచలుగా పెంపొందించుకొని, ఈ సంవత్సరం తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సహకారంతో జాతీయ BC రాయ్ ట్రోఫీ ఫుట్బాల్ పోటీల్లో కూడా పాల్గొనడం జరిగిందని తెలియజేస్తూ, రాచూరి వెంకట సాయి భవిష్యత్తులో కూడా నిబద్దతతో, క్రమశిక్షణ, నిరంతరం సాధనతో ముందుకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడిగా తయారయ్యే అవకాశం ఉందని బొమ్మపాల గిరి బాబు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఫుట్బాల్ క్రీడాకారులు, క్రీడాభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్ లు రాచూరి వెంకట సాయికి అభినందనలు తెలియజేశారు.

Mane Praveen

Dec 28 2023, 11:20

NLG: లెంకలపల్లి గ్రామంలో జనవరి 2న గ్రామసభ

నల్గొండ జిల్లా:

మర్రిగూడ: మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించాలని మర్రిగూడ ఎమ్మార్వో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రజా పాలన కార్యక్రమంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులు స్వీకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. లెంకలపల్లి గ్రామంలో 02.01.2024 నాడు మధ్యాహ్నం గ్రామసభ నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేశారు.

Mane Praveen

Dec 27 2023, 21:33

TS: వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మనముందున్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారుచేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా, వృధా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు. 

ఈరోజు డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ లను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించాలని అన్నారు. అసలైన ప్రజల తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని.. అధికారులు అందుకు అనుగుణంగా బడ్జెట్ ను తయారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత? ఉద్యోగుల జీతభత్యాలు, మనమిచ్చిన హామీలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు. ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపరిచే పని లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని అన్నారు. 

ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన గురుతరమైన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని అధికారులకు గుర్తు చేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని కోరారు. గతంలో అప్పులు దాచి, ఆదాయ వ్యయాలను భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేనే లేదని అన్నారు. ఉన్నది ఉన్నట్లు రాష్ట్ర ఆదాయ స్థితిగతులను జనం ముందు ఉంచాలని సూచించారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని కోరారు. 

తప్పనిసరయితే తప్ప ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాల కొనుగోలు చేయకుండా, ఇప్పుడు ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్ ను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి టి.కె. శ్రీదేవి, సంయుక్త కార్యదర్శి కె. హరిత, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

                    

Mane Praveen

Dec 27 2023, 19:16

TS: ఒక్క పూట ఇఫ్తార్ విందు వద్దు- 12% రిజర్వేషన్ ముద్దు: ముస్లిం మైనారిటీ ఓయూ మలిదశ ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్

హైదరాబాద్: ఒక్క పూట ఇఫ్తార్ విందు వద్దు- 12% రిజర్వేషన్ ముద్దు అని ముస్లిం మైనారిటీ ఓయూ మలిదశ ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారిణి, బుల్లెట్ రాణి డాక్టర్ రేష్మ హుస్సేన్ మాట్లాడుతూ.. పండుగ వేళల్లో మాకు ప్రభుత్వం ఇచ్చే ఒక్క పూట ఇఫ్తార్ విందు కన్నా 12% రిజర్వేషన్ ఇచ్చి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తారని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Mane Praveen

Dec 27 2023, 15:28

NLG: పట్టా భూముల పేరుతో ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డుకోవాలి: సిపిఐ

నల్గొండ జిల్లా:

మునుగోడు పట్టణంలో పట్టా భూముల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోల్గూరి నరసింహ, మండల కార్యదర్శి చాపల శ్రీను లు డిమాండ్ చేశారు. బుధవారం తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. చౌటుప్పల్ రోడ్డులోని 336, 337 సర్వే నెంబర్ల లో పట్టా పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు తెలిపారు.

మునుగోడు పెద్దవాగు ఆనుకొని ఉన్న ఈ సర్వే నెంబర్ల లో వెంచర్లు నెలకొల్పి లక్షల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. భారీ వరదలు, కుంభ వృష్టి వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా వరదలతో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని.. దీని కారణంగా ప్రజల ప్రాణాలు,ఆస్తి నష్టం పెద్ద ఎత్తున సంభవించే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు 336, 337 సర్వే నెంబర్లలలో నాలా కన్వర్షన్ గానీ, డిటిసిపి అనుమతులను ఇవ్వవద్దని కోరారు. పెద్దవాగు హద్దులను గుర్తించి దానికి సంబంధించిన బఫర్ జోన్ కూడా తేల్చాలని కోరారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు, బీసీ సంఘం జిల్లా నాయకులు కైలాస్, మండల కార్యవర్గ సభ్యులు దుబ్బ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Dec 27 2023, 14:28

మర్రిగూడ: భూమిలేని నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయాలి: సిపిఎం పార్టీ

నల్గొండ జిల్లా:

మర్రిగూడ: సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మర్రిగూడ తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మండలంలోని మేటి చందాపురం, ఇందుర్తి, సరంపేట, శివన్నగూడ గ్రామాలకు చెందిన భూమిలేని నిరుపేద దళితులను గుర్తించి.. మేటి చందాపురం లోని 217 సర్వేనెంబర్ గల ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సిపిఎం మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Dec 27 2023, 12:17

NLG: యూజీసీ నెట్ మరియు మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ సాధించిన పడమటిపల్లి వాసి

నల్లగొండ జిల్లా:

దేవరకొండ మండలం, పడమటిపల్లి గ్రామానికి చెందిన పల్లె లింగయ్య వజ్రమ్మ ల కుమారుడు పల్లె ప్రేమ్ కుమార్, ఇటీవల నిర్వహించిన నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్ NET అర్హత సాధించారు. దీంతో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించారు. అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ తెలుగు, ఎం.ఫిల్ పూర్తి చేసిన ఆయన, మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ కూడా సాధించారు. ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుండి ఉన్నత విద్యను అభ్యసించి అర్హతలను సాధించడం పట్ల పలువురు గ్రామస్తులు ప్రేమ్ కుమార్ ను అభినందిస్తున్నారు.